India slams Pak: అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్రమోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని గమనించాం. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల దుర్వినియోగం చేయడంలో తీవ్రమైన చెడ్డ పేరు ఉన్న పాకిస్తాన్, ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతిక స్థితి లేదు. కపట ధర్మాలను బోధించే బదులు, పాకిస్తాన్ తన సొంత మానవహక్కుల రికార్డులపై దృష్టి పెట్టడం మంచిది’’ అని జైస్వాల్ అన్నారు.
Read Also: Fancy Number: దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ గా ‘HR88B8888’.. వేలంలో ఎంత ధర పలికిందంటే..?
అయోధ్యలో మోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ నిరసన తెలిపింది. ఈ చర్యను భారత్‌లో మైనారిటీ వర్గాలపై ఒత్తిడి పెంచడానికి, ముస్లిం వారసత్వాన్ని తుడిచిపెట్టే చర్యగా అభివర్ణించింది. 16వ శతాబ్ధపు బాబ్రీ మసీద్ స్థలంలో రామాలయం నిర్మించినట్లు పేర్కొంది. డిసెంబర్ 6, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగింది. 2019లో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి, రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. 2020లో రామ మందిరానికి ప్రధాని మోడీ పునాది రాయి వేయగా, 2024లో రామ మందిరం భక్తులకు అందుబాటులోకి వచ్చింది.