ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేసింది. ఇప్పుడిప్పుడే దాని ప్రభావం తగ్గింది. కానీ అది అంతం కాలేదు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించింది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ (Corbevax) టీకాను అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీని మరింత విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్ టెక్నికల్ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఈ ప్రతిపాదనను అంగీకరించిన కేంద్రం.. 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను ఇవ్వనుంది. ఇక ప్రికాషన్ డోసులో ఇతర అనారోగ్య సమస్యల క్లాజ్‌ను తొలగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. మార్చి 16 నుంచి 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు ఇవ్వనుంది. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడిన ఇతర అనారోగ్య సమస్యలున్న వృద్ధులకు కేంద్రం ప్రికాషనరీ డోసును పంపిణీ చేస్తోంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 181 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసింది కేంద్రం. 15-18 వయసు వారిలో 5.58కోట్ల మంది తొలి డోసు తీసుకోగా.. 3.38కోట్ల మందికి రెండు డోసులు అందించారు. 60ఏళ్లు పైబడిన వారిలో 1.03కోట్ల మంది ప్రికాషనరీ డోసు తీసుకున్నారు. అన్ని గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలు అందచేస్తారు. 2010 మార్చి అంతకంటే ముందు పుట్టినవారు ఈ టీకాలు తీసుకోవచ్చు. కోవిన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే నేరుగా టీకా కేంద్రానికి వెళ్ళి టీకా తీసుకోవచ్చు. పిల్లల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. పిల్లలకు టీకా ఇచ్చే టప్పుడు తల్లిదండ్రుల అక్కడే వుండాలి.