India approves 120 Pralay missiles for armed forces along China border: సరిహద్దుల్లో ఉద్రికత్త నేపథ్యంలో భారత్ హై అలర్ట్ అవుతుంది. ముఖ్యంగా చైనా సరిహద్దులను మరింత సురక్షితంగా మార్చేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది భారత మిలటరీ. తాజాగా భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి సాయుధ దళాల కోసం 120 ప్రళయ్ క్షిపణులను ఏర్పాటు చేయబోతోంది.
వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులను మోహరించేందుకు వీటిని సేకరించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. బాలిస్టిక్ క్షిపణులను వ్యూహాత్మక కార్యకలాపాల్లో ఉపయోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. గతంలో సీడీఎస్ గా పనిచేస్తూ ప్రమాదంలో చనిపోయిన బిపిన్ రావత్, రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగానే వీటిని ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణులను భారీగా ఉత్పత్తి చేస్తోంది భారత్.
Read Also: Rahul Gandhi: చైనా, పాకిస్తాన్ కలిసి ఉన్నాయి.. భారత్‌పై దాడికి ప్లాన్ చేస్తున్నాయి.
ప్రళయ్ క్షిపణిని గత డిసెంబర్ లో రెండు సార్లు విజయవంతంగా పరీక్షించింది ప్రభుత్వం. ప్రళయ్ 150-500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధిస్తుంది. ఇది సాలిడ్ ప్రొపెల్లెొంట్ రాకెట్ మోటార్ తో పని చేస్తుంది. శతృవుల ఇంటర్సెప్ట్ రాకెట్ల వీటిని గుర్తించి నేల కూల్చడం కూడా కష్టం. ప్రళయ్ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ లడఖ్, తూర్పు ప్రాంతంలో సిలిగురి కారిడార్ చికెన్ నెక్ సమీపంలో మోహరించింది. మరో ఎస్-400 స్వ్కాడ్రన్ వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలలో భారత్ కు అందనుంది. దీంతో సరిహద్దులు మరింత రక్షణగా మారనున్నాయి. ఇక డ్రాగన్ కంట్రీ చైనా, దాయాది పాకిస్తాన్ భారతదేశం వైపు చూడాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.