INDIA alliance: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి సంచలన విజయాన్ని సాధించింది. మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇండియా కూటమి(ఎంవీఏ)లో ఏ ఒక్క పార్టీ కూడా ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోయింది. 105 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలను గెలుచుకుంది.
Read Also: IPL 2025 Mega Action: రూ.27 కోట్లు పలికిన టీమిండియా డైనమెట్ రిషబ్ పంత్
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఘోర పరాజయంపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జులలో ఒకరైన జి. పరమేశ్వర మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో ఒకరికి ఒకరు సహకరించుకోలేదని, ఓటమికి ఇదే కారణమని ఆదివారం అన్నారు. పలు నియోజకవర్గాల్లో శివసేన (యుబిటి)కి కాంగ్రెస్ పూర్తిగా మద్దతివ్వలేదని, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా అదే విధంగా ఉందని పరమేశ్వర్ అన్నారు. ఎన్సీపీ శరద్ పవార్ కూడా సహకరించకపోవడం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని తాను భావించినట్లు చెప్పారు. ముఖ్యంగా విదర్భలో ఎక్కువ స్థానాలు గెలుస్తామని భావించామని, 50 కంటే ఎక్కువ సీట్లు అక్కడ వస్తాయని అనుకున్నాము. కానీ 08 సీట్లు మాత్రమే సాధించామని చెప్పారు. 105 సీట్లలో 60-70 సీట్లు గెలుస్తామని ఊహించాము, కానీ సాధించలేకపోయామని చెప్పారు.
ఈ దేశంలో ఈవీఎంలు ఉన్నంత కాలం కాంగ్రెస్ లేదా మరేదైనా పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టమని బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేయడంలో నిపుణులని, వారికి ఎక్కడ కావాలంటే అక్కడ ఫలితాలను తారుమారు చేస్తారని పరమేశ్వర ఆరోపించారు. మహారాష్ట్రలో మహాయుతి విజయం తర్వాత ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలు హ్యాకింగ్ చేశాయని ఆరోపించారు.