Congress: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ముగ్గురు సభ్యులు ఉండే ఎలక్షన్ ప్యానెల్‌లో ఇప్పటికే ఒక ఖాళీ ఉండగా.. తాజాగా గోయెల్ కూడా రాజీనామా చేయడంతో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతంతా ఆయన మీదే ఉంది. అయితే, సీఈసీ రాజీవ్ కుమార్‌తో విభేదాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్వతంత్ర సంస్థల్ని క్రమపద్ధతిలో నాశనం చేస్తున్నారంటూ.. ప్రజాస్వామ్యం నియంతృత్వంలో భర్తీ చేయబడుతోందని భయాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా..‘‘ ఎన్నికల కమిషనా..? లేదా ఎన్నికల మినహాయింపా..? లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజుల్లో ప్రకటన వెలుబడుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఇప్పుడు ఒకే ఎన్నికల కమిషన్ ఉన్నారు. ఎందుకు..? నేను ఇంతకముందు చెప్పినట్లు, స్వతంత్ర సంస్థలు క్రమపద్ధతిలో నిర్మూలనను మనం ఆపకపోతే, మన ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం దోచుకుంటుంది’’ అని ట్వీట్ చేశారు.
Read Also: CM Pinarayi Vijayan: కాంగ్రెస్ గెలిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు..
కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు పతనమైన చివరి రాజ్యాంగ సంస్థలలో ఒకటిగా ఉంటుందని ఖర్గే అన్నారు. ఎన్నికల కమీషనర్లను ఎంపిక చేసే కొత్త ప్రక్రియ ఇప్పుడు అధికార పార్టీకి, ప్రధాన మంత్రికి అధికారాన్ని అందించింద కాబట్టి కొత్త కమిషనర్‌ని ఎందుకు నియమించలేదు..? మోడీ ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే వారం రాబోతున్న తరుణంలో అరున్ గోయల్ శనివారం రాజీనామా చేశారు. 2027 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్ కూడా ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థల పనితీరులో పారదర్శకత లోపించిందని విమర్శించారు.