CM Pinarayi Vijayan: ఇటీవల కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కే కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్ బీజేపీలో చేరారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ విమర్శలు గుప్పించారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే ప్రభుత్వంలో ఉంటుందని, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాషాయ పార్టీలో పొత్తు పెట్టుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం త్రివేండ్రం జిల్లా ఎల్డీఎఫ్ ఎన్నికల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ గెలిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చని అన్నారు. కేరళలో వన్యప్రాణుల దాడులపై సమగ్ర పరిష్కారం కోసం వన్యప్రాణుల చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తన పార్లమెంట్ పరిధిలో వన్యప్రాణులు-మనుషుల మధ్య ఘర్షణను పార్లమెంట్‌లో ప్రస్తావించలేదు అని విజయన్ అన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన 18 మంది కాంగ్రెస్ ఎంపీలు కేరళను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అంతకుముందు గురువారం కూడా విజయన్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరడాన్ని ప్రస్తావించారు. 11 మంది మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారంతా బీజేపీలో చేరారని, అశోక్ చవాన్, అమరీందర్ సింగ్, దిగంబర్ కామత్, ఎస్ఎం కృష్ణ, విజయ్ బహుగుణ, కిరణ్ కుమార్ రెడ్డి, ND తివారీ, జగదాంబికా పాల్, పెమా ఖండూ, నారాయణ్ రాణే మరియు గిర్ధర్ గమాంగ్ వంటి వారు బీజేపీలో ఉన్నారని చెప్పారు. బీజేపీ ఎవరినైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని, కావాల్సిన డబ్బు, పదవులు ఇస్తోందని విజయన్ ఆరోపించారు.