Amit Shah: రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో స్కామ్‌లు, అవినీతి పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి విమర్శించారు. నరేంద్రమోడీ మళ్లీ అధికారంలోకి వస్తే మోసగాళ్లంతా కటకటాల పాలవుతారని శుక్రవారం అన్నారు. గతేడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే, ఈలోగా నిందితులకు ఉరిశిక్ష పడి ఉండేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అవినీతిలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలని ప్రజలకు పిలునిచ్చారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 300 కన్నా ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని, మోడీ మరోసారి ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ ఉదయ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో షా మాట్లాడారు. విపక్షాలు కొడుకుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే సోనియా గాంధీ లక్ష్యమని, తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను ప్రధాని చేయడమే లాలూయాదవ్ లక్ష్యమని, మేనల్లుడు అభిషేక్‌ను ముఖ్యమంత్రిని చేయడమే మమతా బెనర్జీ లక్ష్యమని, అలాగే అశోక్ గెహ్లాట్ తన కొడుకు వైభవ్‌ను సీఎం చేయాలని భావిస్తున్నారంటూ అమిత్ షా విమర్శించారు.
Read Also: Rajasthan: పాము పగబట్టిందా.. 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాటు.. రెండోసారి..
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తోందని, కన్హయ్యలాల్ హత్య కేసులో దోషులకు శిక్ష ఆలస్యం కావడానికి కాంగ్రెస్ కారణమని అన్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆమెకు సపోర్టుగా సోషల్ మీడియా పోస్టు చేసినందుకు కన్హయ్యలాల్ ను కిరాతకంగా చంపేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పాలనలో మెజారిటీ వర్గీయులు దోపిడీకి గురవుతున్నారని అమిత్ షా ఆరోపించారు.
కేంద్రం పీఎఫ్ఐని నిషేధిస్తే.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పాలనలో పీఎఫ్ఐ ర్యాలీ జరిగింది. కరౌలీలో హిందూ పండుగను నిలిపివేశారని, అల్వార్ లో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని కూల్చేశారని ఆరోపించారు. ప్రభుత్వం గట్టిగా వాదించకపోవడంతో 2008 నాటి జైపూర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషులుగా విడుదలయ్యారని అన్నారు. 2014 ముందు పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే వారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, సర్జికల్ స్ట్రైక్స్ తో సమాధానం చెప్పారని అన్నారు.