Rajasthan: పాములు పగబడుతాయనే మూఢనమ్మకం మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. అయితే పాములు పగబట్టడం అనేది ట్రాష్ అని హేతువాదులు కొట్టిపారేస్తారు. అయితే కొన్నిసార్లు జరిగే సంఘటలను చూస్తే మాత్రం పాములు నిజంగా పగబడతాయా..? అనే సందేహం వస్తుంది. అలాంటి ఘటనే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read Also: Uniform civil code: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో “యూనిఫాం సివిల్ కోడ్” బిల్లు.!
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ జోధ్‌పూర్ జిల్లాలోని మెహ్రాన్‌గఢ్ గ్రామానికి చెందిన జసాబ్ ఖాన్(44) పాము కాటుతో మరణించాడు. 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పాము కాటుకు గురయ్యాడు. మొదటిసారి ప్రాణాలతో బయటపడగా.. రెండోసారి మాత్రం ప్రాణాలు దక్కలేదు. జూన్ 20న మొదటిసారిగా జసాబ్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. పోఖ్రాన్ లోని ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఖాన్ ఆస్పత్రికి నుంచి తిరిగి వచ్చిన 4 రోజుల తర్వాత జూన్ 26న మరోసారి పాము కాటుకు గురయ్యాడు.
ఈ సారి జోధ్ పూర్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఖాన్ మరణించాడు. ఖాన్ రెండు సార్లు వైపర్ రకానికి చెందిన ‘బండి’ అనే పాము కాటుకు గురయ్యాడు. ఇవి ఎడారి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ విషాదకరమైన ఘటనపై భనియానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండుసార్లు పాము ఖాన్ కాలి చీలమండలంపైనే కాటేసింది. మొదటి పాముకాటు నుంచి అతను పూర్తిగా కోలుకోలేక ముందే మరోసారి కాటేయడంతో విషాన్ని తట్టుకోలేక మరణించినట్లు చెబుతున్నారు. జాసబ్‌కు తల్లి, భార్య, నలుగురు కుమార్తెలు, 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు.