Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతున్నప్పటికీ.. రెండు మూడు రోజులుగా జమిలి ఎన్నికలపై జోరుగా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఏకంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికల నిర్వహణ.. అందుకు ఎదురయ్యే సవాళ్ళు, వాటిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశాలు.. అలాగే జమిలి ఎన్నికలు సాఫీగా సాగడానికి ఉన్న అవకాశాలను కోవింద్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. అయితే జమిలి ఎన్నికలతో దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించబడితే ప్రజలకు కొంత మేరకు మేలు జరుగుతుందనే వాదన ఉంది. అయితే రాష్ట్రాల ఎన్నికలు వేరుగా నిర్వహించాలని.. కేంద్ర పరిస్థితులు వేరు.. రాష్ట్ర పరిస్థితులు వేరు కాబట్టి.. రెండు ఎన్నికలు వేరు వేరుగా నిర్వహించాలని కొందరు అంటున్నారు. అయితే ఇవి ఆయా రాజకీయ పార్టీల వాదనలుగా ఉన్నాయి. వాస్తవంగా ప్రజలు ఏమీ కోరుకుంటున్నారనేది కేంద్రం నియమించిన కమిటీ సిఫారసులో ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జమిలి ఎన్నికలతో ప్రజలకు ఎంత మేరకు లాభం జరుగుతుందనేది చూడాలనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. జమిలి ఎన్నికల అంశాన్ని ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విడిచిపెట్టకుండా పట్టుకొని వస్తున్నారు. గతంలో 1999లో వేసిన కమిటీ సిఫారసుల నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ వరకు జమిలి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టే ఉన్నారు. లోక్‌సభతోపాటు రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ గత కొన్ని ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది. ఇప్పటికే రెండు మూడుసార్లు దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (జమిలి ఎన్నికలు) సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏయే ప్రొసీడింగ్స్‌ను అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
Read Also: Health Tips : వీటిని రోజూ ఇలా తీసుకుంటే చాలు..ఆ సమస్యలు మాయం..
జమిలి ఎన్నికలు అంటే..
జమిలి ఎన్నికలు అంటే .. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు అలాగే లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే. అయితే స్వతంత్ర భారత దేశంలో ప్రారంభంలో జరిగిన ఎన్నికలు జమిలి పద్ధతిలోనే జరిగాయి. ఆ తరువాత మారుతున్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమిలి ఎన్నికలు కాస్త మారిపోయి లోక్‌సభకు ఒకసారి ఎన్నికలు జరుగుతుండగా.. రాష్ట్రాల్లో వేర్వురు సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇపుడు తిరిగి జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1957, 1962, ఆ తరువాత 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
Read Also: Pawan Kalyan: పవర్ స్టార్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..’హరి హర’ వీరమల్లు కొత్త పోస్టర్ ఇదే..
జమిలి ప్రక్రియ పెద్దది
జమిలి ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ర్టాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దుచేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడగించాల్సిన అవసరమూ రావొచ్చు. కాబట్టి జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదాపు 5 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని 2018లో లా కమిషన్ అభిప్రాయపడింది. ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలకు లా కమిషన్ సూచించింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ర్టాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో కనీసం 67 శాతం (362 ఎంపీలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం (164 ఎంపీలు) ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. దీనికి తోడు దేశ వ్యాప్తంగా కనీసం 14 రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది.
Read Also: Elon Musk: ప్రపంచంలో అన్నింటి కంటే ఆ విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది
మార్పు చేయాల్సిన వాటి గురించి..
ఆర్టికల్ 356: రాష్ర్టాల అసెంబ్లీలను రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉన్నది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది. ఒకవేళ, వేరే సందర్భంలో చట్టసభ రద్దుకు నిర్ణయిస్తే, అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకొంటుంది. ఆర్టికల్ 172 (1): అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది. అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాలవ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటినుంచి కాలపరిమితి మొదలౌతుంది. ఆర్టికల్ 324: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమయానుసారం, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాలవ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83(2): ప్రజాతీర్పుతో కొలువుదీరిన లోక్‌సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు. ఆర్టికల్ 83: పెద్దల సభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2, 3 చాప్టర్స్, పార్ట్-15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలి బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది.