Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాలుగా చీలిపోయింది. మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది.
ఇదిలా ఉంటే సీఎం అశోక్ గెహ్లాట్ సీఎం కుర్చీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవిని విడిచిపెట్టనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘‘ఇటీవల ఓ మహిళ నువ్వు నాలుగోసారి సీఎం కావాలని నాతో చెప్పింది. నేను సీఎం పదవిని వదిలిపెట్టాలని అనుకుంటున్నాను, కానీ సీఎం పదవి నన్ను వదలడం లేదు. భవిష్యత్తులో కూడా సీఎం పదవి నన్ను వదలదు’’ అని ఆమెకు చెప్పానని వ్యాఖ్యానించారు. హైకమాండ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిందంటే నాలో ఏదో విశేషం ఉండాలి కదా అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వర్గపోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి పార్టీ సీనియర్ నేత సచిన్ పైలెట్ ని ఆహ్వానించకపోవడంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో టికెట్ల మంజూరుపై కూడా అసంతృప్తి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్నదాన్ని ప్రకటించలేదు.
Read Also: Sreesanth: పాకిస్తాన్ టీమ్కు భారత మాజీ బౌలర్ చురకలు.. ఇండియా ‘C’ టీంతో పోలిక
బీజేపీ కుతంత్రాల వల్లే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. సచిన్ పైలెట్ గురించి మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. సచిన్ పైలెట్ మద్దతుదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. మేమంతా ఐక్యంగానే ఉన్నామని, టికెట్ పంపిణీలో విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పైలెట్ వర్గంలోని ఓ ఒక్కరిని కూడా తాను వ్యతిరేకించలేదని తెలిపారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పేర్లపై చర్చించేందుకు పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ బుధవారం సమావేశమైంది. ఖర్గే, గెహ్లాట్‌లతో పాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జి సుఖ్‌జీందర్ రంధవా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ దోతస్రా, ప్రధాన కార్యదర్శి (సంస్థ) కేసీ వేణుగోపాల్, పార్టీ రాజస్థాన్ స్క్రీనింగ్ కమిటీ చీఫ్ గౌరవ్ గొగోయ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ, రాజస్థాన్‌లో గత ఐదేళ్లలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ సుపరిపాలనపై కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు.