Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గంటల వ్యవధిలోని రెండు పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండు పేలుడు సంభవించింది. గురువారం ఉదయం ఉధంపూర్‌లోని పాతబస్టాండ్‌లో మరో పేలుడు చోటుచేసుకుంది. బస్టాండ్‌లో నిలిపి ఉన్న బస్సులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. జిల్లాలో 8గంటల వ్యవధిలోనే రెండు పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన పోలీసులు పేలుళ్ల గురించి ఆరా తీస్తున్నారు.
బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఉధంపూర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొమాలి చౌక్ వద్ద ఓ బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉదంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. విచారణ జరుగుతోంది. గంటల వ్యవధిలోనే ఇవి చోటుచేసుకోవడంతో ఏమైనా ఉగ్రవాద కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
“రాత్రి 10:30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సమీపంలో పార్క్ చేసిన వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పేలుడుకు కారణం ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాము” అని ఉదంపూర్ డీఐజి సులేమాన్ చౌదరి తెలిపారు.