Honeymoon Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’లో కీలక పరిణామం ఎదురైంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లయిన కొన్ని రోజులకు భర్త రాజ రఘువంశీని హనీమూన్ కోసం మేఘాలయకు తీసుకెళ్లి కిరాయి హంతకులతో హతమార్చింది. ఈ హత్యలో సోనమ్ కీలక నిందితురాలు కాగా, ఈ హత్యను తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి ప్లాన్ చేసింది. రాజా రఘువంశీని ముగ్గురు కిరాయి హంతకులు సోహ్రాలోని వీసావ్‌డాంగ్ సమీపంలో హత్య చేశారు.
Read Also: Cable Bridge: వందల కోట్లు వెచ్చించి కట్టిన కేబుల్ బ్రిడ్జిపై బట్టలు ఆరబెట్టిన వైనం..!
సోనమ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోహ్రా సబ్-డివిజన్లోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెప్టెంబర్ 17న విచారించనుంది. శుక్రవారం ఆమె పిటిషన్ దాఖలు చేసినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ చంద్ర తెలిపారు. అయితే, కేసు రికార్డులను పరిశీలించడానికి ప్రాసిక్యూషన్ సమయం కోరింది. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యలో దాఖలు చేసిన ఛార్జి షీట్లో లోపాలు ఉన్నాయని సోనమ్ న్యాయవాది పేర్కొన్నారు.
మే నెలలో మేఘాలయకు వెళ్లిన సోనమ్, రాజ్ లు కనిపించకుండా పోయారు. కొన్ని రోజుల వెతుకులాట తర్వాత రాజ్ మృతదేహం లభించింది. దీని తర్వాత, సోనమ్ యూపీ పోలీసుల ముందు లొంగిపోయింది. దీంతో మొత్తం కేసుకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం మేఘాలయ పోలీసులు సోనమ్, రాజ్‌లతో పాటు ముగ్గురు కిరాయి హంతకులు -విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలపై 790 పేజీల చార్జిషీట్‌ను సమర్పించారు.