Himanta Biswa Sarma: మహారాష్ట్రలో ఘన విజయం సాధించినప్పటికీ, జార్ఖండ్‌లో మాత్రం బీజేపీ తేలిపోయింది. జార్ఖండ్‌లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. అయితే, జార్ఖండ్‌లో బీజేపీ తరుపున అన్నీ తానై వ్యవహరించిన అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మకు ఈ ఫలితాలు షాక్‌కి గురిచేశాయి. బిజెపి ఎన్నికల పరాజయంతో తాను చాలా బాధపడ్డానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం అన్నారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని తన రెండో ఇళ్లుగా అభివర్ణించిన హిమంతకు ఈ ఫలితాలు నిరాశను కలిగించాయి.
Read Also: Space Out Competition: 90 నిమిషాలపాటు ‘ఏమి చేయవద్దు’.. బహుమతి గెలుచుకోండి
మరోవైపు అస్సాంలోని ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్రలో సంచలన విజయం సాధించిన మహాయుతి కూటమికి అభినందనలు తెలియజేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పార్టీ తరుపున హిమంత కో – ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎంకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చొరబాటుదారుల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని, అభివృద్ధి పథం వైపు నడిపించాలని కోరారు. నిన్న వెలువడిన జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో మొత్తం 81 స్థానాల్లో ఇండియా కూటమికి 56 సీట్లు రాగా, బీజేపీకి కూటమికి 24 సీట్లు మాత్రమే వచ్చాయి.