Himanta Biswa Sarma: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ.. అతను హిందువు కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాలూ తీరును ఎండగట్టారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనకు తెలిసిన హిందూ సంస్కృతిని మరిచిపోయాడని ఎద్దేవా చేశారు. ఇంతకాలం హిందూ వ్యతిరేకిగా ఉండటమే అందుకు కారణం కావచ్చని అన్నారు. అస్సాంలోని బొంగైగావ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Chandrababu: బీసీలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్.. రూ.4 వేలకు పెంపు
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ అస్సాం ప్రజలకు తాను ప్రేమను అందించాననే వ్యాఖ్యలపై హిమంత స్పందిస్తూ.. ‘‘నాకు అతని ప్రేమ వద్దు, అస్సాంలో చాలా మంది తల్లులు, కుమార్తెలు ఉన్నారు, వారి ప్రేమ నాకు సరిపోతుంది’’ అని అన్నారు.
బీహార్ పాట్నాలో జరిగిన సమావేశంలో లాలూ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ హిందువు కాదని, ఎందుకంటే అతని తల్లి చనిపోతే గుండు చేయించుకోలేదని, ఏ హిందువు కూడా ఇలాంటి పని చేయడని, ప్రధానికి కుటుంబం లేదని, అందుకే హిందువు కాదని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోమవారం బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా మొదలైన వారు ‘మోడీకా పరివార్’ అంటూ వారి సోషల్ మీడియా బయోడెటాలో జోడించారు.