Mamata Banerjee: కోల్‌కతా వైద్యురాలి ఘటన పశ్చిమ బెంగాల్ సర్కార్, సీఎం మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్‌లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశంలో నిరసనలకు కారణమైంది. బెంగాల్‌లో ఇప్పటికీ బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశానికి డాక్టర్లు ఎవరూ హాజరుకాలేదు.
READ ALSO: Deepjyoti: ప్రధాని నివాసంలో కొత్త సభ్యుడు.. “దీప్‌జ్యోతి”తో మోడీ ఫోటోలు
ఇదిలా ఉంటే, తాజాగా శనివారం మమతా బెనర్జీనే డాక్టర్లు నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వెళ్లారు. వారి డిమాండ్లను పరిశీలించి, ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు సంబంధించిన దోషులుగా ఎవరు తేలినా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘ మాకు న్యాయం కావాలి’’ అనే నినాదాల మధ్య వైద్యులను ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు. ‘‘నేను ముక్కమంత్రిగా కాకుండా మీ ‘‘దీదీ’’(అక్క)గా వచ్చాను. నా పదవి పెద్దది కాదు, ప్రజలు పెద్దవారు. నిన్న మీరింతా ఈ భారీ వర్షంలో నిరసన వ్యక్తం చేసినందుకు, నేను కూడా నిద్రపోలేదు. దయచేసి మీ డిమాండ్లను నెరవేరస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను’’అని ఆమె అన్నారు.
వైద్యులతో మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల సంక్షేమ కమిటీలను తక్షణమే రద్దు చేసినట్లు బెనర్జీ ప్రకటించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇది నా చివరి ప్రయత్నం అని అన్నారు. సీఎం అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆందోళనకు దిగిన వైద్యులు చర్యలు జరిగే వరకు తమ డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.