Hathras Stampede: హత్రాస్‌లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. వీరంతా సత్సంగాన్ని నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం హత్రాస్‌లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు.
Read Also: Rajasthan: కొంపముంచిన సవాల్.. మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా
అలీఘర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు. వారంతా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, సేవదార్లుగా పనిచేశారని వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లో ‘ముఖ్య సేవాదార్’ దేవ్ ప్రకాష్ మధుకర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మధుకర్‌పై సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. మధుకర్ అరెస్ట్ కోసం పోలీసులు కోర్టు నుండి నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
బాబా అరెస్టుపై శలభ్ మాథుర్ ఏమన్నారు?
బాబా అరెస్ట్‌పై ఐజీ శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ఈరోజు ఆరుగురిని అరెస్టు చేశామని, అయితే దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఎవరిని అరెస్టు చేయాలో దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని అన్నారు. విచారణలో భోలే బాబా పాత్ర ఉన్నట్లు తేలితే ఆయనపై చర్యలు తీసుకుని అరెస్టు చేస్తామన్నారు. అవసరమైతే, అధికారులు ‘భోలే బాబా’ని కూడా ప్రశ్నించవచ్చు. ఆయన పేరును మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదు. కానీ విచారణకు అనుమతి ఉంది. నారాయణ్ సకార్ హరి నేపథ్యంపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయనపై నేరారోపణలు ఉన్న నగరాలకు బృందాలను పంపించారు.
Read Also: Bansuri Swaraj: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ నియామకం
పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఈ కార్యక్రమానికి 80,000 మందికి పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ, 2.50 లక్షల మందికి పైగా ప్రజలు మతపరమైన సమావేశానికి హాజరయ్యారు. దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక ప్రకారం, వేలాది మంది అనుచరులు ఆశీర్వాదం కోసం, బోధకుడి పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించడానికి వెళుతుండగా, వారిని భోలే బాబా భద్రతా సిబ్బంది నెట్టారు. దాని కారణంగా , చాలా మంది కింద పడిపోయారు, ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటన వెనుక వ్యతిరేక శక్తులు ఉన్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం భోలే బాబా ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.