PV Narasimha Rao: దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందంటే, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే దానికి ముఖ్యకారణం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేసిన సంస్కరణలే. లైసెన్స్ రాజ్ నడిచే కాలంలో సరళీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానిగా పీవీ, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక పరిస్థితిని గాడి పెట్టారు. దివాళా తీసే దశ నుంచి ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టేలా ఈ ఇద్దరి ధ్వయం ఎన్నో సంస్కరణలు చేసింది.
పీవీని గుర్తించని కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతగా ప్రధాని, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహరావుకి తగిన గౌరవాన్ని ఏ రోజు కల్పించలేదని సాక్షాత్తు వారి కుటుంబీకులే ఆరోపించారు. చివరకు బాబ్రీ మసీదు విధ్వంసానికి కారణమని ఆ పార్టీ నేతలు నిందించారు.
రాజీవ్ గాంధీ మరణం తర్వాత దేశ పగ్గాలు చేపట్టిన పీవీ దేశ పరిస్థితిని గాడిన పెట్టారు. అయితే, గాంధీ కుటుంబానికి వచ్చిన ఖ్యాతి పీవీ నరసింహరావుకు దక్కలేదనేది కాదనలేని సత్యం. కాంగ్రెస్ అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలే అని ఇప్పటికే ఆ పార్టీలోని నేతలు చెబుతున్నారు. చివరకు పీవీ నరసింహరావు గొప్పతనాన్ని, ఆయన సంస్కరణలను కూడా కాంగ్రెస్ ఓన్ చేసుకోలేదు. చివరకు పీవీ సమకాలికులైన ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్‌లకు కూడా కాంగ్రెస్ తగిన గౌరవాన్ని ఇవ్వలేదని పలువురు విమర్శిస్తున్నారు.
Read Also: Bharat Ratna PV Narasimha Rao: దివంగత ప్రధాని పీవీ కి భారత రత్న.. హర్షం వ్యక్తం చేసిన నేతలు
భారతరత్నకు అర్హుడే, కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు:
మనం ఇప్పుడు మొబైల్ కావాలంటే నిమిషాల వ్యవధిలో స్టోర్‌కి వెళ్లి తెచ్చుకుంటున్నాము. బైకులు, కార్లు ఇలా ఏది కావాలంటే అది డబ్బులుంటే కొన్ని గంటల్లో ఇంటి ముందు ఉంటున్నాయి. పీవీకి ముందు దేశంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. ప్రపంచీకరణకు దూరంగా, ప్రపంచమార్కెట్‌కి భారత్ ద్వారాలు మూసి ఉండేవి. ఏ వ్యాపారం చేయాలన్నా లైసెన్స్ రాజ్ అడ్డం వచ్చేంది. చివరకు ఓ ల్యాండ్ ఫోన్ కావాలన్నా, కారు లేదా బైక్ కొనుక్కోవాలన్నా నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేంది.
భారత దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టి, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్‌కి పీవీ మార్గాలు వేశారు. తన సంస్కరణల కారణంగా భారతరత్నకు అర్హుడే అయినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. ఏ రోజు కూడా పీవీకి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ భావించలేదని పీవీ వారసులు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఈ రోజు పీవీకి బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంతో నరసింహారావు మనవడు, బిజెపి నాయకుడు ఎన్‌వి సుభాష్ మాట్లాడుతూ.. ఆలస్యమైన పీవీకి గౌరవం దక్కిందని, కాంగ్రెస్‌కి చెందిన వ్యక్తికి ప్రధాని మోడీ అత్యున్నత పురస్కారాన్ని ప్రధానం చేశారని అన్నారు. 2004-2014 మధ్య ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని, గాంధీ ఫ్యామిలీని నిందించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు నరసింహరావుని బలిపశువుగా చేయడంలో గాంధీ కుటుంబం కీలక పాత్ర వహించిందని సుభాష్ అన్నారు.
అంత్యక్రియల సమయంలోనూ రాజకీయమే..?
పీవీ మరణం తర్వాత అంతిమ సంస్కారాల్లో కూడా కాంగ్రెస్ పాలకులు సంస్కారం మరిచారని కుటుంబ సభ్యలు ప్రధాన ఆరోపణల. సాధారణంగా ప్రధానిగా పనిచేసిన ఏ వ్యక్తికైనా ఢిల్లీలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇప్పటి వరకు అందరు ప్రధానులకు అలానే చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నిర్దయగా, తమకు చెప్పకుండా హైదరాబాద్ తీసుకువచ్చారని పీవీ కుటుంబీకుల ప్రధాన ఆరోపణ. కనీసం కాంగ్రెస్ పెద్దలు ఆయనకు నివాళులు అర్పించలేదనే విమర్శలు ఉన్నాయి. పీవీకి ఢిల్లీలో స్మారకం నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అది అమలు కాలేదు.