Sonia Gandhi: లోక్‌సభ 5వ విడతలో ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంతో దేశ ప్రజల దృష్టి ఈ స్థానంపై ఉంది. గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన ఆయన, ఈ సారి తన తల్లి సోనియాగాంధీ కొన్ని పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ, కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. మే 20న ఈ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇదిలా ఉంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోసం రాయ్‌బరేలీ ప్రజలకు కీలక విన్నపం చేశారు. ‘‘నేను నా కొడుకుని మీకు అప్పగిస్తున్నారు. మీరు నన్ను మీ వారిగా అనుకున్న విధంగానే రాహుల్ గాంధీతో వ్యవహరించండి. అతను మిమ్మల్ని నిరాశపరచడు’’ అని ఆమె అన్నారు. ‘‘ఇందిరాగాంధీ రాయ్ బరేలీ ప్రజలు నాకు నేర్పిన పాఠాలనే రాహుల్, ప్రియాంకాలకు నేర్పాను. అందర్ని గౌరవించడం, ప్రజల హక్కుల కోసం, అన్యాయాలపై పోరాటం నేర్పాను’’ అని అన్నారు. శుక్రవారం రాయ్‌బరేలీలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Swati Maliwal assault: ఇదంతా బీజేపీ కుట్ర.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్..
2004లో తొలిసారిగా రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపీగా కావడంతో 2024 ఎన్నికల్లో ఆమె పోటీ నుంచి దూరమయ్యారు. తను ఇంత కాలం ఎన్నుకున్నందుకు ప్రజలకు సోనియా గాంధీ థాంక్స్ చెప్పారు. చాలా కాలం తర్వాత మీ మధ్య ఉండే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని, 20 ఏళ్ల పాటు నాకు సేవ చేసే అవకాశాన్ని మీరు కల్పించారని రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశించి అన్నారు.
‘‘రాయ్‌బరేలీ నా కుటుంబం, అదే విధంగా అమేథీ కూడా నా ఇల్లు. ఈ ప్రదేశంతో నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా కుటుంబం యొక్క మూలాలు కూడా గత 100 సంవత్సరాలుగా ఈ నేలతో ముడిపడి ఉన్నాయి. ఈ సంబంధం చాలా పవిత్రమైనది. ఈ అనుబంధం గంగా మాత అవధ్ మరియు రాయ్‌బరేలీ రైతుల ఉద్యమంతో ప్రారంభమై, ఇది నేటి వరకు కొనసాగుతోంది’’ అని సోనియా గాంధీ అన్నారు.