Haldwani violence: ఉత్తరాఖండ్ ఆర్థిక రాజధాని హల్ద్వానీలోని బన్‌భూల్‌పురాలో ఇటీవల అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత ఘటన తీవ్రమైన అల్లర్లకు దారి తీసింది. ఆ ప్రాంతంలోని ప్రజలు, అధికారులు, పోలీసులు, జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడ్డారు. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పలు వాహానాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. పోలీసులను సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగినట్లు అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు పుష్కర్ సింగ్ ధామి సిద్ధమైంది.
Read Also: Aphrodisiac Pills: ఫస్ట్ నైట్ రోజు “మాత్రలు” తీసుకుని భర్త శృంగారం.. తీవ్రగాయాలతో నవవధువు మృతి..
ఈ అల్లర్లలో ఐదుగురు మరణించగా.. 60 మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత 300కి పైగా ముస్లిం కుటుంబాలు బన్‌భూల్‌పురా ప్రాంతాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కర్ఫ్యూతో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో, లగేజీ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదిలా ఉంటే, హింసాకాండ నేపథ్యంలో పోలీసులు ఇంకా పెద్ద ఎత్తున సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లకు కారణమైన 30 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. చాలా మంది కోసం గాలిస్తున్నారు. అరెస్టైన వారి నుంచి ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హల్ద్వానీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూని సడలించినప్పటికీ.. బన్‌భూల్‌పురాలో మాత్రం ఇంకా కర్ప్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని ముస్లిం కుటుంబాలు కూడా పారిపోవడానికి ప్లాన్ చేస్తుండటంతో, జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని మార్గాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసేసింది. హింసాకాండలో రెచ్చిపోయిన అల్లరి మూకల పారిపోయేందుకు ప్రయత్నించే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జమియత్ ఉలేమా-ఎ-హింద్ ప్రతినిధులు జిల్లా అధికారులతో సమావేశమై గంట పాటు చర్చించారు. అధికారులు హడావుడిగా మసీదును కూల్చేయడమే ఉద్రిక్తత, హింసకు దారి తీసిందని వారు చెప్పారు. మరోవైపు మసీదు, మదర్సా కూల్చివేసిన స్థలంలోనే పోలీస్ స్టేషన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు.