Omar Abdullah: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక కార్యక్రమంలో ముస్లిం మహిళ హిజాబ్ తీసేయాలని చెబుతూ, లాగడం వివాదస్పదమైంది. ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలు ఇస్తున్న కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు, నితీష్ కుమార్‌కు బీజేపీలో కొంత మంది నేతలు మద్దతు ఇస్తున్నారు. బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మహిళ నియామక పత్రాన్ని అంగీకరించవచ్చు లేదంటే నరకానికి పోవచ్చు అని వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదమైంది.
Read Also: Pawan Kalyan: ఎవరినీ వదలొద్దు.. కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్!
తాజాగా, ఈ వివాదం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఆ పార్టీ నుంచి ఇంతకన్నా మంచిది ఆశించలేము అని అన్నారు. ‘‘నేను హర్యానా లేదా రాజస్థాన్‌లో ఒక హిందూ మహిళ ముసుగు తీసి ఉంటే, బీజేపీ అప్పుడు కూడా ఇదే మాట అనేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఒక ముస్లిం వ్యక్తి హిందూ మహిళ ముసుగు తీసి ఉంటే, అది ఎలాంటి సమస్యలకు దారితీసేదో ఊహించండి. కానీ ఆ మహిళ ముస్లిం కాబట్టి, బీజేపీ ఈ విధంగా ప్రవర్తిస్తోంది. వారి నుండి మనం ఇంతకంటే ఎక్కువ ఆశించలేము’’ అని అన్నారు.
అంతకుముందు రోజు, నితీష్ కుమార్‌ను సమర్థిస్తూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరైనా నియామక పత్రాన్ని తీసుకోవడానికి వెళితే, వారు తమ ముఖాన్ని చూపించకూడదా?? ఇది ఇస్లామిక్ దేశమా.? మీరు మీ పాస్‌పోర్టు తీసుకోవడానికి వెళ్లినా, విమానాశ్రయానికి వెళ్లినా, మీరు మీ ముఖాన్ని చూపించరా? ’’ అని ప్రశ్నించారు. ఆ అమ్మాయి ఉద్యోగం చేయడానికి నిరాకరించినా పర్వాలేదు, నరకానికి పోయినా పర్వాలేదు అని అన్నారు.