Gyanvapi ‘Shivling’ to be protected until further orders Says Supreme Court: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ వివాదంపై కీలక ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గతంలో తాము ఇచ్చిన రక్షణ ఆదేశాలను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో మసీదు వీడియో సర్వేలో భాగంగా వాజూఖానాలోని ఓ కొలనులో ‘శివలింగం’ వంటి ఆకారాన్ని కనుక్కున్నారు. అప్పటి నుంచీ ఈ ప్రాంతానికి రక్షణ ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో పాటు.. ప్రార్థనలు చేసుకోవడానికి ముస్లింలకు అనుమతి ఇచ్చింది. శివలింగం దొరికన చోటును పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Covid Vaccination: క్యాన్సర్ చికిత్సను మెరుగుపరుస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు.. అధ్యయనంలో వెల్లడి.
గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నవంబర్ 12 వరకు ముగుస్తుండటంతో ఒక రోజు ముందు ఈ కేసు సుప్రీంలో విచారణకు వచ్చింది. హిందు పక్షం తరుపున న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించడంతో ఈ రోజు విచారణ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం జ్ఞానవాపిపై దాఖలైన అన్ని వ్యాజ్యాల ఏకీకరణ కోసం వారణాసి జిల్లా న్యాయమూర్తి ముందు ఒక పిటిషన్ పెట్టుకునేందుకు హిందూ పక్షానికి అనుమతించింది. సర్వే కమిషనర్ నియామకంపై గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు నిర్వహణ కమిటీ చేసిన అప్పీలుపై మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని హిందూ పక్షాన్ని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వారణాసి సివిల్ కోర్టులో ఐదుగురు హిందూ మహిళలు దావా వేయడంతో ఈ వివాదం ప్రారంభం అయింది. గతంలో వారణాసి సివిల్ కోర్టు జ్ఞానవాపి మసీదు వీడియో సర్వేకు అనుమతించింది. ఈ సర్వేలో శివలింగం ఆకారంతో పాటు గోడలపై కొన్ని హిందూ దేవతల చిత్రాలను గుర్తించారు. అయితే ఈ కేసుపై శివలింగం దొరికిన ప్రాంతాన్ని ఎనిమిది వారాల పాటు రక్షించాలని మే 17న సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరోసారి ఈ ఆదేశాలను పొడగించింది సుప్రీంకోర్టు.