Gujarat Bus Crashes Into SUV After Driver Suffers Heart Attack, 9 Dead: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టయోటా ఫార్చూనర్ కారును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 28 మంది గాయపడ్డారు. ప్రస్తుతం 11 మందిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం తెల్లవారుజామున గుజరాత్ నవ్ సారి నుంచి వల్సాద్ వెళ్తున్న బస్సు, టయోటా ఫార్చునర్ ని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. నేషనల్ హైవే-8పై వెస్మా గ్రామం వద్ద జరిగింది.
Read Also: Karimnagar: అంతుచిక్కని వ్యాధితో కుటుంబం బలి.. గంగాధరలో మిస్టరీ డెత్స్
సూరత్ లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమానికి హాజరై ఫార్చూనర్ లో తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే సమయంలో బస్సు నవ్ సారి నుంచి వల్సాద్ వెళ్తోంది. ఇరు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతులంతా గుజరాత్ లోని అంకాలేశ్వర్ నివాసితులని నవ్ సారి ఎస్పీ రుషికేష్ ఉపాధ్యాయ తెలిపారు. మృతులకు సంతాపాన్ని తెలిపారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ‘‘గుజరాత్లోని నవ్సారిలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ విషాదంలో వారి కుటుంబాలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. దేవుడు వారికి బాధను భరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందిస్తోంది, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును రోడ్డు పై నుంచి తొలగించారు. దీంతో యాథావిధిగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఈ నెల 14న అహ్మదాబాద్లో జరిగిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.