GST 2.0 report: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు సామాన్యుడికి మేలు చేశాయని కేంద్రమంత్రులు చెప్పారు. జీఎస్టీ రిపోర్టును మీడియాతో పంచుకున్నారు. జీఎస్టీ రేటు తగ్గింపుల వల్ల తగ్గిన పన్నుల ప్రయోజనాలు దేశ ప్రజలకు అందాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రమంతులు పియూష్ గోయల్, అశ్విని వైష్ణవ్‌లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. దసరా ముందు వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగాయని ఆమె చెప్పారు.
‘‘ప్రభుత్వం 54 రోజువారీ వినియోగ వస్తువులను నిశితంగా పరిశీలిస్తోంది. వాటిలో ప్రతిదానిలోనూ, GST సంస్కరణల వల్ల కలిగే పన్ను ప్రయోజనం తుది వినియోగదారునికి చేరిందని మేము కనుగొన్నాము. ప్రధానమంత్రి దీపావళి బహుమతి అందించబడింది’’ అని ఆమె చెప్పారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారాలు ఊహించిన దాని కన్నా మరింత ఎక్కువగా సాగాయని, జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగదారులకు అందించామని నిర్మాలా సీతారామన్ చెప్పారు.
Read Also: Asim Munir: మళ్లీ అవే వ్యాఖ్యలు.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ఇంకా బుద్ధి రాలేదు..
గత నెలలో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది. నిత్యావసర వస్తువలతో పాటు టీవీలు, రిఫ్రిజ్‌రేటర్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు కార్ల ధరలు భారీగా తగ్గాయి. తగ్గిన ధరలు సెప్టెంబర్ 22న, నవరాత్రి ప్రారంభంలో అమలులోకి వచ్చాయి. జీఎస్టీ కోతల వల్ల సామాన్యుడి వద్ద డబ్బులు మిగిలాయని, వాహనాల కొనుగోలు ఎక్కువగా జరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు. త్రివీలర్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 5.5 శాతం పెరిగాయని, ద్విచక్ర వాహనాలు 21.6 లక్షల యూనిట్లకు చేరుకుందని, సెప్టెంబర్ లో కార్ల వంటి ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3.72 లక్షలుగా ఉన్నాయని ఆమె చెప్పారు. సెప్టెంబర్ నెలలో హీరో మోటార్స్ తన అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసిందని వెల్లడించారు. సెప్టెంబర్ 22న జీఎస్టీ సంస్కరణలు ప్రారంభమైన మొదటి రోజే ఏసీ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని, టీవీ అమ్మకాలు 30-35% పెరిగాయని కేంద్ర మంత్రి హైలైట్ చేశారు.
నవరాత్రి సందర్భంగా వాహన అమ్మకాలు పెరిగాయని, మారుతి సుజుకి మొదటి ఎనిమిది రోజుల్లో 1.65 లక్షల కార్లను విక్రయించినట్లు వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. మహీంద్రా అమ్మకాలు 60 శాతం పెరిగాయని, టాటా 50,000 వాహనాలనున విక్రయించిందని, ఎలక్ట్రానిక్ రంగం కూడా అన్ని రికార్డుల్ని బద్ధలు కొట్టిందని గోయల్ చెప్పారు. ఈ ఏడాది రూ. 20 లక్షల కోట్ల విలువైన అదనపు ఎలక్ట్రానిక్ వినియోగం ఉంటుందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అంచనా వేశారు. ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు 25శాతం పెరిగాయని చెప్పారు.