కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. అందులో ఉన్న పొరపాట్లను అధిష్టానానికి ఎత్తిచూపుతూ వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్.. ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్‌లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ క్రమంలో గులాంనబీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.. ఇదే సమయంలో.. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన కొన్ని సందర్భాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.. ఇటీవల గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ.. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదు అని వ్యాఖ్యానించారు. అంటే, పార్టీని బలహీనపరుస్తున్న అంశాలపైనే తప్ప, కాంగ్రెస్ సిద్ధాంతాలపై ఆయనకు ఎలాంటి వ్యతిరేక లేదు అనేది స్పష్టమైంది..
Read Also: BRS : భద్రాద్రి కొత్తగూడెంలో రెండుగా చీలిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌లు
మరోవైపు, భారత్ జోడో యాత్ర కన్వీనర్ దిగ్విజయ్ సింగ్.. రాహుల్ యాత్రలో పాల్గొనాలంటూ గులాంనబీ ఆజాద్‌కు ఆహ్వానం పలికారు. అంతకుముందే కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. గులాంనబీ ఆజాద్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు.. ఈ పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గులాంనబీ ఆజాద్‌కు గానీ, గులాంనబీ ఆజాద్‌కు కాంగ్రెస్ పార్టీపైగానీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదని.. ఈ క్రమంలోనే ఎన్నికలలోపు ఆజాద్ తిరిగి పాతగూటికే చేరనున్నాడనే ప్రచారం జోరందుకుంది.. అయితే, ఈ పరిణాలు, ప్రచారంపై డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడైన గులాంనబీ ఆజాద్ స్పందించారు.. నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు వస్తున్న కథనాలు చూసి షాక్ అయ్యానని వ్యాఖ్యానించిన ఆయన.. దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు ఇటువంటి కథనాలను ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.. మా పార్టీ నేతలను, మద్దతుదారులను నిరుత్సాహపరిచేందుకు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టిన ఆయన.. నా గురించి ప్రచారాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.. నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాననే వార్త నిరాధారమైనది కొట్టిపారేశారు గులాంనబీ ఆజాద్.