Himanta Biswa Sarma: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిస్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్న గౌరవ్ గొగోయ్‌పై ఆరోపణలు చేశారు. గోగోయ్ పాకిస్తాన్‌లో 15 రోజులు గడిపారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన పరోక్షంగా పాక్ సైన్యానికి సహాయం చేసి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే, గౌరవ్ గొగోయ్ ఈ ఆరోపణలపై స్పందించలేదు. పాకిస్తాన్ పర్యటన గురించి సీఎం చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించనూ లేదు.
Read Also: iQOO Neo 10: ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్దమైన ఐకూ నియో 10..!
గౌహతిలోని లోక్ సేవా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ మా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ వెళ్లినట్లు అధికారంగా నమోదు చేయబడింది. ఆయన వెళ్లడం, రావడం అట్టారీ-వాఘా సరిహద్దుల్లో నమోదైంది’’ అని అన్నారు. గొగోయ్ 15 రోజులు ఇస్లామాబాద్‌లో ఉన్నారని అన్నారు. మొదటి ఏడు రోజులు ఆయన భార్య ఆయనతో ఉందని ఆరోపించారు. ఆ తర్వాత ఆమె ఇండియాకు వచ్చినప్పటికీ, గొగోయ్ అక్కడే ఉన్నాడని హిమంత అన్నారు.
భారత్ వచ్చిన తర్వాత గొగోయ్ దాదాపు 90 మంది బాలురు, బాలికల్ని పాకిస్తాన్ రాయబార కార్యాలయం తీసుకెళ్లారని, వారిలో చాలా మంది తాము పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి వెళ్తున్నట్లు తెలియదని చెప్పారని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని సీఎం హిమంత బిశ్వ సర్మ అన్నారు. ‘‘గౌరవ్ గొగోయ్ పాక్ ఆర్మీ కార్యాలయం, లాహోర్, సింధ్ లేదా ఇతర సున్నితమైన ప్రదేశాలు సందర్శించారా..? అనే ప్రశ్నలు ఉన్నాయి. వీటికి ఆయన సమాధానం ఇవ్వాలి. ’’ అని సీఎం అన్నారు. అతను మాత్రమే భారత పౌరుడని, ఆతడి భార్య బ్రిటిష్ వ్యక్తి, అతడి పిల్లలు వేర్వేరు విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని సమాచారం, అతను ఎప్పుడైనా తన పాస్‌పోర్ట్‌ని మార్చుకోవచ్చు అని హిమంత బిశ్వ సర్మ ఆరోపించారు.