బెంగళూరులో ఇటీవల ఇద్దరు యువతులు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా యువకుడు అసభ్యకరంగా తాకి లైంగిక వేధించిన సంఘటనను ఇంకా మరువక ముందు మరో దుర్ఘటన టెక్ సిటీలో వెలుగు చూసింది.
బెంగళూరులోని ఒక పార్కులో స్కూటీపై ఒక యువకుడు-బుర్ఖా ధరించిన యువతి ఎదురెదురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక గుంపు వచ్చి వాగ్వాదం పెట్టుకున్నారు. ఒక మహిళ మాత్రం వీడియో తీస్తూ కనిపించింది. వేరే మతానికి సంబంధించిన మహిళతో ఎందుకు తిరుగుతున్నావని యువకుడితో గొడవ పెట్టుకున్నారు. అలాగే బుర్ఖా ధరించి వేరే పురుషుడితో కూర్చోవడానికి సిగ్గులేదా? అని యువతితో గొడవకు దిగి దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Arjun s/oVyjayanthi: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రిలీజ్ డేట్ లాక్.. రేపే ట్రైలర్
ఇక ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురు వ్యక్తులు.. జంటపై దాడి చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గిరీష్ తెలిపారు. నిందితులు.. యువకుడిని కర్రతో కొట్టారని పేర్కొన్నారు. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇందులో ఒక బాలుడు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.
ఇక ఈ ఘటనపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలను సహించమన్నారు. ఇది బీహార్ లేదా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కాదన్నారు. కర్ణాటక ప్రగతిశీల రాష్ట్రం అన్నారు.