సాధారణంగా రోడ్డు పక్కన ఉన్న హోటల్లో భోజనాలు, టిఫిన్లు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు.. వారు ఎలా తయారు చేస్తారు.. ఏం కలుపుతారు.. అని ఎవరు చూడరు. ఇక ఒక్కోసారి సాంబార్ లో బొద్దింకలు పడ్డాయి, ఈగలు పడుతుంటాయి అని వింటూనే ఉంటాం.. అయితే ఎప్పుడైనా ఇడ్లీలో కప్పు కళేబరం ఉండడం చూశారా ..? తాజాగా తంజావూరు జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. కుంభకోణం ప్రభుత్వాస్పత్రి రోడ్డులో ఒక క్యాంటిన్ ఉంది.. ఆ హాస్పిటల్లో ఉండే రోగులందరికి అక్కడి నుంచే టిఫిన్లు, భోజనాలు వెళ్తాయి. అక్కడ టిఫిన్లు బాగున్నా, బాగోకపోయినా దగ్గర కాబట్టి అందరు అక్కడే తీసుకుంటారు. ఇక ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మురుగేశన్ అనే వ్యక్తిని చూడడానికి బంధువులు వచ్చారు. వచ్చేటప్పుడు అతడికి ఆ క్యాంటిన్ నుంచి ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చారు. మురుగేశన్ పార్శిల్ విప్పి చూడగా, ఓ ఇడ్లీలో కప్ప కళేబరం కనిపించింది. దీంతో షాక్ తిన్న రోగి బంధువులు క్యాంటీన్ ఓనర్ ని నిలదీశారు. దీంతో హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడే తింటున్న మిగతావారు సైతం యజమానిపై దాడికి పాల్పడ్డారు. ఇలాంటి అపరిశుభ్రమైన ఫుడ్ పెడుతున్నారని హోటల్ ని ధ్వంసం చేశారు. ఇక ఈ ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులకు సంచారమే అందడంతో వారు కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.