Atishi: మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషిని ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలిగా ఉండబోతోంది. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు అతిషిని తమ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న రేఖా గుప్తాని బలంగా ఎదుర్కొనేందుకు మరో మహిళా నేత అతిషిని ఆప్ రంగంలోకి దించింది.
Read Also: Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పొందింది. బీజేపీ 2 దశాబ్దాల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, 22 చోట్ల ఆప్ గెలిచింది. ఆప్ ప్రధాన నేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు ఓడిపోయారు. అతిషి అతి కష్టంపై గెలిచారు. అయితే, ప్రస్తుతం ఆప్‌లో ఉన్న కీలక నేతల్లో అతిషి మాత్రమే గెలుపొందడంతో ఆమెనే ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికైన తర్వాత అతిషి మాట్లాడుతూ..బీజేపీ ఢిల్లీ మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చిందని, దీని కోసం పోరాడుతామని చెప్పారు. బలమైన ప్రతిపక్షంగా, బీజేపీ ఇచ్చిన అన్ని హామీలను అమలు పరిచేలా చేస్తామని ఎక్స్‌లో ఆమె ట్వీట్ చేసింది. ప్రతిపక్ష నేతగా ఎన్నికలైన అతిషికి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు.