Kapil Sibal: కర్ణాటక అసెంబ్లీలో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇతర ఎన్డీయేతర ప్రతిపక్షాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాజ్యసభ ఎంపీ, మాజీ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సందేశం ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో ప్రజల మనుసులు గెలుచుకోవాలని కాంగ్రెస్ కు సూచించారు. ఎన్నికల్లో గెలవడం కష్టం.. ప్రజల హృదయాలను గెలుచుకోవడం చాలాచాలా కష్టం అంటూ.. కర్నాటకలో రాబోయే ఐదేళ్లపాటు బహిరంగంగా, నిజాయితీగా, వివక్ష చూపకుండా ప్రజల హృదయాలను గెలుకుకోవాలని సూచించారు.
అంతకుముందు బీజేపీ ఓటమిని గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి ఓడిపోయారు, కర్ణాటక ప్రజలు గెలిచారు. 40 శాతం కమీషన్లకు, ది కేరళ స్టోరికి, విభజన రాజకీయాలకు, అహంకారం, అబద్ధాలకు నో చెప్పారు. ఇదే కాంగ్రెస్ గెలవడానికి కారణమయ్యాయని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. యూపీఏ1, 2లో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో ఆయన ఇటీవల ఎన్నికలేతర వేదిక ‘ఇన్సాఫ్’ను ప్రారంభించారు.
కర్ణాటక ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 135 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 65 స్థానాలకు, జేడీఎస్ 19 స్థానాలకు పరిమితం అయ్యాయి. దక్షిణాదిలో బీజేపీకి ఏకైక కంచుకోటగా ఉన్న కర్ణాటకను ఆ పార్టీ కోల్పోయింది. 2024 ఎన్నికల ముందు ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి నైతికంగా బలాన్ని ఇస్తుంది.