“ట్విట్టర్” భారత అధిపతి పై కేసు నమోదు అయ్యింది. తప్పుడు భారతదేశ భౌగోళిక చిత్ర పటం పోస్ట్ పై ఉత్తర ప్రదేశ్ లో “ట్విట్టర్” భారత అధిపతి మనీష్ మహేశ్వరి పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసారు. భజరంగ్ దళ్ నాయకుడు ప్రవీణ్ భాటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ దేశ ద్రోహ చర్యకు కావాలనే పాల్పడినందున, తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాజిక వర్గాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు సృష్టించడం, శతృభావనలు కల్పించడం, ద్వేష పూరితమైన చర్యలకు పాల్పడినందుకు భారత శిక్షా స్మృతి (ఐ.పి.సి) సెక్షన్ 505 ( 2) కింద, కొత్త ఐ.టి నిబంధనలలో సెక్షన్ 74 కింద కేసు నమోదు చేసారు పోలీసులు.
అయితే, “ట్విట్టర్” భారత అధిపతి మనీష్ మహేశ్వరి కి కర్నాటక హైకోర్టు నుంచి తాత్కాలికంగా ఊరట లభించింది. అరెస్ట్ కాకుండా హైకోర్టు మినహాయుంపు ఇచ్చింది. బెంగుళూరు వాసి అయిన మనీష్ మహేశ్వరి విచారణ కోసం ఉత్తర ప్రదేశ్ వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పిన కోర్టు… అంతగా అవసరమైతే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యు.పి పోలీసులు విచారణ జరుపవచ్చని పేర్కొంది. వివాదస్పద రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలకు సంబంధించి గత ఫిబ్రవరి లో ట్విట్టర్ పోస్టుల పై కూడా వివాదం చెలరేగింది.