Operation Sindoor: పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లను కూల్చేశాం.. మన పైలట్‌లు సురక్షితం..

  • పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లను కూల్చేశాం..
  • మన పైలెట్లు అందరూ సురక్షితం..
  • ఆపరేషన్ సిందూర్‌పై ఎయిర్ మార్షల్ ఏకే భారతి..
Ak Bharati

Ak Bharati

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కి చెందిన ఫైటర్ జెట్‌లను భారత్ కూల్చివేసినట్లు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీఏం) ఆదివారం తెలిపారు. ఫైటర్‌ జెట్లు ఏ జనరేషన్ అని ఖచ్చితంగా చెప్పకున్నా, హైటెక్ ఫైటర్ జెట్‌లను కూల్చేసినట్లు తెలిపారు. పాక్ విమానాలు మన సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా నిరోధించామని, వాటిలో కొన్ని విమానాలను ఖచ్చితంగా మేము కూల్చేశామని, వారి వైపు ఖచ్చితంగా నష్టం జరిగిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి తొలిసారిగా త్రివిధ దళాల అధికారులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.

Read Also: Indian Navy: కరాచీతో సహా చాలా లక్ష్యాలను ఇండియన్ నేవీ టార్గెట్ చేసింది..

మీడియా రిపోర్ట్స్ ప్రకారం, భారత్ ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 ఫైటర్ జెట్‌ను కూల్చేసినట్లు నివేదించాయి. అయితే, పాక్ వైమానిక దళం కోల్పోయిన ఫైటర్ జెట్ల సంఖ్యను అధికారులు పేర్కొనలేదు. ‘‘ నా దగ్గర సంఖ్య ఉంది. దానిని నిర్ధారించుకోవడానికి సాంకేతిక వివరాలను పరిశీలిస్తున్నాము. ’’ అని అన్నారు. పాకిస్తాన్‌కి చెందిన కీలకమైన వైమానిక స్థావరాలను, కమాండ్ సెంటర్లను, సైనిక మౌలిక సదుపాయాలను, ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసి ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ చేస్తున్నట్లు భారత విమానాల కూల్చివేతపై అధికారులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అయితే, భారత పైలెట్లు అంతా సురక్షితంగా ఇంటికి చేరారని చెప్పారు.