Ram Navami violence: రామ నవమి రోజు బీహార్ ససారంలో ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ హింసలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మాజీ బీజేపీ ఎమ్మెల్యే జవహర్ ప్రసాద్ ను రోహ్తాస్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామం బీహార్ రాష్ట్రంలో జేడీయూ వర్సెస్ బీజేపీగా మారింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జవహర్ ప్రసాద్ ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని బీజేపీ ఆరోపించింది.
Read Also: Harish Rao : అక్కడ రజినీకి అర్థమైంది.. కానీ ఇక్కడి గజినీలకు ఎందుకు అర్ధమైతలే..
అయితే ఈ అరెస్ట్ పై స్పందించిన సీఎం నితీష్ కుమార్.. జవహర్ ప్రసాద్ ప్రమేయంపై ఆధారాలు లభించిన తర్వాతే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్ట్ వెనక రాజకీయ కారణాలు లేవని ఆయన అన్నారు. రామనవమి ఊరేగింపు తర్వాత జరిగిన హింసలో బీజేపీని ఇరికించేందుకే ప్రసాద్‌ను అరెస్టు చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు సుశీల్ కుమార్ మోడీ ఆరోపించారు. 1994లో ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్యకేసులో దోషిగా తేలిన డాన్ ఆనంద్ మోహన్‌ను విడుదల చేసేందుకు నితీష్ కుమార్ నిబంధనలను మార్చడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజకీయంగా లబ్ధి పొందాలనే బీజేపీ ఇలా చేస్తుందని ఆర్జేడీ విమర్శించింది.
మార్చి 31న రామనవమి ఊరేగింపు తర్వాత ససారంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శాంతిభద్రతలను అదుపు చేసేందుకు అధికారులు ససారంలో 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సంఘవ్యతిరేఖ శక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ససారంతో పాటు బీహార్ లో పలు ప్రాంతాల్లో రామ నవమి రోజున హింస చెలరేగింది.