Siddaramaiah: కన్నడ భాష, నేల, నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కన్నడిగుడిపై ఉందని, రాష్ట్రంలో కన్నడ వాతావరణాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. కన్నడ వాతావరణాన్ని కల్పించడం అందరి కర్తవ్యమని, అందుకోసం కర్ణాటకలో నివసించే వారందరూ కన్నడ నేర్చుకోవాలని, అలా మౌనంగా ఉండలేమని ఆయన అన్నారు. కన్నడిగులు పెత్తనం చేసేవారు కాదని, కన్నడపై ప్రేమ పెంచుకోవాలని, ఇతర రాష్ట్రాల్లోని భాషోన్మాదులుగా మారకూడదని సూచిస్తూనే, మన భూమి, మన భాష, దేశంపై గౌరవం, అభిమానం పెంపొందించుకోవాలని ఆయన అన్నారు.
Read Also: Summer solstice: రేపు ఏడాదిలోనే ‘‘సుదీర్ఘమైన పగలు’’.. అయనాంతాలు అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతాయి..?
కర్ణాటకలో నివసించే వారు కన్నడ మాట్లాడాలని, కన్నడ తప్ప మరే భాష మాట్లాడకూడదని ప్రతిజ్ఞ చేయాలని, కన్నడిగులు ఉదారంగా ఉంటారని, అందుకే ఇతర భాషలు మాట్లాడే వారు కూడా మాట్లాడే వాతావరణం కర్ణాటకలో ఉందని, కన్నడ నేర్చుకోకుండా జీవించే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఈ పరిస్థితి కనిపించడని, వారు మాతృభాషలో మాట్లాడుతారని సిద్ధరామయ్య అన్నారు. మనం కూడా మన మాతృభాషలో మాట్లాడటం మనకెంతో గర్వకారణమని చెప్పారు.
కన్నడ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కర్ణాటక నామకరణ సువర్ణ మహోత్సవ వేడుకల్లో భాగంగా విధానసౌధ పశ్చిమ ద్వారం సమీపంలో నాదదేవి భువనేశ్వరి అమ్మవారి కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమిపూజ అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవల కాలంలో కర్ణాటకలో కన్నడలో మాట్లాడటం రాదని చెబుతూ, స్థానికులు ఇతర రాష్ట్రాల వారిపై దాడికి పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.