Amit Shah: పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే) గురించి ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి ఫైర్ అయ్యారు. పీఓకేలోని ప్రతీ అంగుళం భారత్‌కే చెందుతుందని, దానిని ఏ శక్తి లాక్కోలేదని ఆయన శుక్రవారం అన్నారు. ‘‘పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని, దానిని గౌవరించాలని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చెబుతున్నారు, కొద్ది రోజుల క్రితం ఇండియా కూటమి నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్లో అణుబాంబు ఉందని, పీఓకే గురించి మాట్లాడవద్దని అన్నారు.’’ ఈ వ్యాఖ్యలపై అమిత్ షా మాట్లాడుతూ.. నేను ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలకు పీఓకే భారత్‌కి చెందినదని చెప్పాలని అనుకుంటున్నానని అన్నారు.
Read Also: Fatehpur Sikri Dargah: ఫతేపూర్ సిక్రీ దర్గా కింద కామాఖ్య దేవత ఆలయం ఉంది.. ఆగ్రా కోర్టులో కేసు..
పీఓకేని భారత్‌కి చెందినదని, ఏ శక్తి దాన్ని లాక్కోలేదని శుక్రవారం జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగిందో తెలియడం లేదని, పీఓకే భారత్‌లో భాగమని పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత, ఇప్పుడు పీఓకేపై ప్రశ్నలు గుప్పిస్తున్నారని, అణుబాంబుల గురించి ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అవినీతిలో మునిగిపోయిందని ఆయన ఆరోపించారు.
జేఎంఎం కూటమి భూ కుంభకోణం, మైనింగ్ స్కామ్, ఉపాధిహామీ స్కామ్, మద్యం కుంభకోణంలో మునిగిపోయిందని, పేద ప్రజల సొమ్ముని దోచుకునేందుకు వారిని బీజేపీ అనుమతించబోదని అమిత్ షా అన్నారు. జేఎంఎం-కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ 70 ఏళ్లు అడ్డంకులు సృష్టించిందని, అయితే ప్రధాని మోడీ ఐదేళ్లలో గుడి కట్టారని, రాహుల్ బాబా తన ఓటు బ్యాంకుకు భయపడి రామమందిర శంకుస్థాపనకు రాలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ గిరిజనుడిని కూడా రాష్ట్రపతిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.