PM Modi: కేరళలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ లెఫ్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. సీపీఎం వయనాడ్ లోక్‌సభ స్థానానికి అన్నీ రాజాను అభ్యర్థిగా పేర్కొన్న ఒక రోజు తర్వాత ప్రధాని ఈ రెండు పార్టీల తీరుపై మంగళవారం విమర్శలు గుప్పించారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ శత్రువులని, కానీ బయట BFF( బెస్ట్ ఫ్రండ్స్ ఫర్ఎమర్) అంటూ ఎద్దేవా చేశారు. తిరువనంతపురంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ ‘యువరాజు’ని కేరళలోని వయనాడ్ నుంచి తరిమికొట్టాలని లెఫ్ట్ ఫ్రంట్ కోరుకుంటోందని అన్నారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు.
‘‘ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు, కేరళలో ఒకరికొకరు శత్రువులు అయితే, కేరళ బయట మాత్రం మంచి మిత్రులు. కలిసి కూర్చుని భోజనం చేసే స్నేహితులు’’ అని ప్రధాని విమర్శించారు. వామపక్షాలు కాంగ్రెస్ యువరాజుని వయనాడ్ నుంచి తరిమికొట్టాలని కోరుకుంటున్నాయని, కేరళకు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నాయని ప్రధాని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఒకే ప్రాధాన్యత ఉందని, వారు తమ కుటుంబాలను మాత్రమే చూసుకుంటున్నాయని, వారికి దేశ సంక్షేమం కన్నా కుటుంబ సంక్షేమమే ముఖ్యమని ప్రధాని అన్నారు.