పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో జనం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. వీరికి ఎలక్ట్రిక్ బైక్ లు ఊరట నిస్తున్నాయి. ప్రారంభంలో ఖర్చు ఎక్కువే వున్నా.. రోజూ పెట్రోల్ బంకులకు వెళ్లే అవకాశం లేదు. ఒకసారి ఛార్జి చేస్తే వంద కిలోమీటర్ల వరకూ మైలేజ్ వస్తుంది. ఛార్జింగ్ పాయింట్లు కూడా అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ బైక్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైక్ లు అంత సేఫ్ కాదా? అంటే కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవునేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చెన్నైలో వరుసగా ప్రమాదాలకు గురి అవుతున్నాయి ఎలక్ట్రిక్ బైక్ లు. తిరుచ్చి మనప్పరైలో ఓ షాపులో పార్క్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు వ్యాపించాయి. దీంతో బాలు అనే యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. నీళ్ళతో మంటలు ఆర్పివేశారు కుటుంబసభ్యులు. దీంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు జనం. మూడు రోజుల క్రితం వేలూరు లో ఛార్జింగ్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో తండ్రి, కూతురు మరణించిన సంగతి తెలిసిందే.
పేలుడు ధాటికి పొగలు రావడంతో ఊపిరి ఆడక అక్కడిక్కడే మృతి చెందారు తండ్రి, కూతురు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భద్రతా వైఫల్యం కనిపిస్తోందని, ఎలక్ట్రిక్ బైక్ ల పట్ల జాగ్రత్తగా వుండాలంటున్నారు నిపుణులు.