పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు సోనూసూద్‌పై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. మోగా నియోజకవర్గంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ సోదరి మాళవికా పోటీ చేస్తున్నారు. దీంతో పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో నటుడు సోనూసూద్‌పై ఈసీ ఆంక్షలు విధించింది. ఆయన సోదరి పోటీ చేస్తున్న మోగాలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా నిషేధించింది. సోనూసూద్ కారును కూడా స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎన్నికల అధికారులు సోనూసూద్‌ను ఇంటికి తరలించారు. ఇంటి నుంచి బయటికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే ఈ వ్యవహారంపై సోనూసూద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ఒక పార్టీకి ఓటేయమని తాను ఎవరినీ అడగలేదని సోనూసూద్ క్లారిటీ ఇచ్చాడు. ఇతర పార్టీల అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు యత్నిస్తున్నాయని ఆరోపించాడు. ఈసీ తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. పోలింగ్ కేంద్రాల వెలుపల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరాలను సందర్శించడానికి మాత్రమే తాను వెళ్లానని సోనూసూద్ వివరణ ఇచ్చాడు.