Shiv Sena: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ‘ విల్లు బాణం’ సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతాయని భారత ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. దీంతో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. గతేడాది శివసేనలో ఏక్ నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలపడంతో కాంగ్రెస్- శివసేన- ఎన్సీపీల కూటమి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే, బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Read Also: Xi Jinping: చైనా ఆర్థిక వ్యవస్థ క్లిష్టంగా ఉంది.. ఎట్టకేలకు ఒప్పుకున్న షి జిన్‌పింగ్
ఇదిలా ఉంటే పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఏక్ నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం గొడవలు పడుతున్నాయి. అయితే తాజాగా పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికే కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. శివసేన పార్టీ ప్రస్తుత రాజ్యాంగం అప్రజాస్వామికమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలాంటి ఎన్నికలు లేకుండా ప్రజాస్వామికంగా కోటరీకి చెందిన వ్యక్తులను ఆఫీస్ బేరర్లుగా నియమించడం దారుణమన్నారు. ఇలాంటి పార్టీ నిర్మాణాలు విశ్వాసాన్ని కలిగించడంలో విఫలమవుతున్నాయని పేర్కొంది. 2018లో శివసేన పార్టీ రాజ్యాంగాన్ని ఎన్నికల కమిషన్ కు ఇవ్వలేదు. 1999లో అప్పటి శివసేన చీఫ్ బాలా సాహెబ్ ఠాక్రే తీసుకువచ్చిన రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘిస్తున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది.
2019 ఎన్నికల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 56 మంది శివసేన ఎమ్మెల్యేల్లో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీల్లో 13 మంది ఏక్ నాథ్ షిండే వర్గానికే మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల సంఘం శుక్రవారం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఓట్ల శాతాన్ని ఉదహరించింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 55 మంది శివసేన అభ్యర్థులకు అనుకూలంగా ఏకనాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు దాదాపు 76 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇదే విధంగా ఉద్దవ్ వర్గం ఎమ్మెల్యేలకు 23.5 శాతం ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.