Eknath Shinde: 26/11 ముంబై ఉగ్ర దాడుల తర్వాత, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోకపోవడం ‘‘ద్రోహం’’ అని శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఎవరి ఒత్తిడితో కాంగ్రెస్ పాకిస్తాన్‌పై దాడికి సిద్ధ పడలేదని ప్రశ్నించారు. శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే తన సొంత పార్టీ అనుచరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Read Also: Gandhi: దేశ విభజన తర్వాత.. మహాత్మా గాంధీ పాకిస్థాన్‌లో నివసించాలనుకున్నారా..? ఆశ్చర్యపరిచే నిజం..!
ముంబై దాడుల తర్వాత, పాకిస్తాన్‌పై దాడి చేయకపోవడం అప్పటి యూపీఏ ప్రభుత్వం పిరికితనమని అన్నారు. ఇది భారత ప్రజలకు చేసిన ద్రోహంగా అభివర్ణించారు. ఇటీవల, అమెరికా ఒత్తిడి వల్ల పాక్‌పై దాడి చేయలేదని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఏక్ నాథ్ షిండే విమర్శలు గుప్పించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా స్పందించారని, మన సైన్యం పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పిందని చెప్పారు. నక్క సింహం చర్మాన్ని ధరిస్తే సింహం అవ్వడని పాకిస్తాన్ గురించి చెప్పారు. నిజమైన సింహం ప్రధాని మోడీ అని అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే భారత సైన్యం పరాక్రమాన్ని ప్రశ్నించారని, ఆయన పాకిస్తాన్‌లో దసరా ర్యాలీ నిర్వహించి, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని షిండే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ, శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తాయని ప్రకటించారు.