Arvind Kekriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ని ఈడీ వ్యతిరేకించింది. ప్రచారం చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ని ఈడీ వ్యతిరేకించింది. సుప్రీంకోర్టుకు గురువారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో ఒక రోజు ముందు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భాను ప్రియ అఫిడవిట్ దాఖలు చేశారు. మరోవైపు ఈడీ తొలిసారి కేజ్రీవాల్ పేరును చార్జిషీట్‌లో చేర్చింది.
‘‘ఎన్నికల కోసం ప్రచారం చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కాదు. ఈడీకి తెలిసినంత వరకు, ఏ రాజకీయ నాయకుడు కూడా పోటీ చేసే అభ్యర్థి కాకుంటే అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయబడలేదు.’’ అని అఫిడవిట్ పేర్కొంది. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే, ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేయలేమని మరియు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేమని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి కేజ్రీవాల్‌కి అనుకూలంగా ఏదైనా రాయితీని ఇస్తే చట్టబద్దమైన పాలన మరియు సమానత్వానికి అసహ్యకరమైందని ఈడీ పేర్కొంది.