Dubai: గల్ఫ్ కంట్రీ యూఏఈ భారతీయులకు శుభవార్త చెప్పింది. దుబాయ్ ఇండియన్స్ కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలు వ్యాపారం, విహారయాత్రలను సులభతరం చేయనున్నాయి. ఇటీవల కాలంలో గల్ఫ్ కంట్రీ యూఏఈ-భారత్ మధ్య వ్యాపార సంబంధాలు విస్తృతమవుతున్నాయి. మరోవైపు విహారయాత్రకు అనువైన ప్రదేశంగా భారతీయులు దుబాయ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు.
2023లో భారతదేశం నుంచి దుబాయ్‌కి 2.46 మిలియన్ల సందర్శకులు వెళ్లారు. ఇది కోవిడ్ మహమ్మారి కాలంతో పోలిస్తే ఏకంగా 25 శాతం పెరుగుదల. ఇది దేశాన్ని నంబర్ వన్ సోర్స్ మార్కెట్‌గా నిలిపిందని దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం(DET) డేటా గురువారం వెల్లడించింది. 2023కి ముందు ఏడాది దుబాయ్‌కి భారత్ నుంచి 1.84 మిలియన్ల మంది పర్యాటకులు వెళ్లారు. 2019లో 1.97 మంది పర్యాటకులు దుబాయ్ వెళ్లినట్లు డేటా చూపిస్తోంది.
Read Also: Varun Tej: మా సినిమాతో బీజేపీ, అర్ఎస్ఎస్ కి సంబంధం లేదు
అనూహ్యంగా 34 శాతం వార్షిక వృద్ధితో ఒకే దేశం(భారత్) నుంచి దుబాయ్ వెళ్లిన అంతర్జాతీయ సందర్శకుల్లో భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు డీఈటీ డేటా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్, దుబాయ్ మధ్య ప్రయాణాన్ని మరింత బలోపేతం చేయడానికి, నిరంతర ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి, పర్యాటక, వ్యాపార-వాణిజ్య సంబంధాలను ప్రోతహించే నేపథ్యంలో దుబాయ్ భారతీయుల కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టినట్లు డీఈటీ తెలిపింది.
2-5 రోజుల్లో వీసా జారీ చేయబడుతుంది, ఒక వ్యక్తి 90 రోజుల పాటు దేశంలో ఉండటానికి అనుమతి లభిస్తుంది, ఇదే వ్యవధికి మరోసారి వీసా పొడగించవచ్చు. ఒక ఏడాదిలో మొత్తం 180 రోజులు మించకుండా దుబాయ్‌లో ఉండేలా నిబంధనలు ఉన్నాయి. భారత్ నుంచి వచ్చే వారితో తమ పర్యాటక రంగం రికార్డు స్థాయి పనితీరుకు దోహడపడిందని, దుబాయ్ కీలకమైన మార్కెట్‌గా వ్యాపారం, పెట్టుబడుల మరింత అనుకూలంగా ఉందని, దీనిని మరింత బలోపేతం చేస్తూ.. D33 ఎజెండా యొక్క లక్ష్యాలను సాధించడంలో మాకు సహాయం చేయడంలో భారతదేశం సమగ్ర పాత్ర పోషిస్తుందని దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామీ చీఫ్ బాదర్ అలీ చెప్పారు.