Marriage: తప్పతాగిన వరుడు, వధువు మెడలో దండ వేయడానికి బదులుగా తన స్నేహితుడి మెడలో దండ వేయడంతో పెళ్లి క్యాన్సల్ అయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. మద్యం తాగి ఉన్న వరుడిని చూసిన వధువు, అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ సంఘటన తర్వాత పెళ్లి ఊరేగింపును కూడా వధువు వెనక్కి పంపింది.
ఈ సంఘటన క్యోల్దియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వరడు, అతడి తండ్రితో పోలీసులు మాట్లాడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు అడుగుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఫిబ్రవరి 22 శనివారం రాత్రి వివాహ ఊరేగింపు వచ్చిన సమయంలో ఘటన చోటు చేసుకుంది.
Read Also: IND vs PAK: పాకిస్తాన్ ఓటమి.. మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ
ముందుగా వధువు వరుడి మెడలో దండ వేసింది. అయితే, తాగిన మత్తులో ఉన్న వరుడు పొరపాటున తన స్నేహితుడి మెడలో దండ వేశాడు. దీంతో ఒక్కసారిగా పెళ్లికి వచ్చిన వారు షాక్ అయ్యారు. ఈ పరిస్థితిని చూసిన వధువు కోపంతో, అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. కుటుంబ సభ్యులు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ, వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరకు చేసేదేం లేక పెళ్లిని రద్దు చేసుకున్నారు. వధువు తండ్రి ఫిర్యాదు ఆధారంగా వరుడు, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. వరుడిపై, అతడి కుటుంబంపై వరకట్న వేధింపులు, బహిరంగంగా అవమానించడంపై కేసులో నమోదు చేసినట్లు తెలుస్తోంది.