కరోనాకు చెక్ పెట్టేందుకు క్రమంగా కొత్త వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే భారత రక్షణ సంస్థ డీఆర్డీవో భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్స కోసం 2డీజీ డ్రగ్ ను తయారు చేయగా.. తాజాగా.. 2డీజీ డ్రగ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. పౌడర్ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక, 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి… హైదరాబాద్ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి… డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీవోకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐఎన్ఎంఏఎస్) ఈ మందును అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే కాగా.. 2-డీజీ ఔషధ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కూడా లభించింది. ఇక, ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులపై బాగా పనిచేస్తుందని, కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ ఔషధాన్ని ఇస్తే వాళ్లు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని ఇప్పటికే డీఆర్డీవో ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంలో ఈ -డీజీ డ్రగ్ కూడా కీలక భూమికి పోషించనుంది.