వారిద్దరూ వైద్య వృత్తిలో ఉన్నారు. చూడచక్కని జంట. ఇంకేముంది పెళ్లితో చక్కని జంట అవుతుందని పెద్దవాళ్లు భావించారు. ఇద్దరికి గ్రాండ్‌గా వివాహం జరిపించారు. కానీ ఏడాది తిరగకుండానే భార్యను కాటికి పంపేశాడు దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. వైద్య వృత్తికే మాయని మచ్చగా మిగిలిపోయింది.

కృతికా రెడ్డి-మహేందర్ రెడ్డి ఇద్దరూ డాక్టర్లు. ఈ జంటకు గత ఏడాది మే 26న వివాహం జరిగింది. ఇద్దరూ కూడా విక్టోరియా ఆస్పత్రిలో వైద్యులుగా కొనసాగుతున్నారు. కృతికా రెడ్డి చర్మవ్యాధి నిపుణురాలు. ఏప్రిల్ 21న కృతికా రెడ్డి అనారోగ్యానికి గురైందని సమీపంలోని ఒక ఆస్పత్రికి తరలించాడు. డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లుగా ప్రకటించారు. కృతికా రెడ్డిది సహజ మరణంగా భావించి సమాధి కార్యక్రమాలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Durgapur Student Rape: మమత ‘తల్లి’లాంటిది.. సీఎంకు క్షమాపణ చెప్పిన బాధితురాలి తండ్రి
కానీ మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో మాత్రం అసహజ మరణంగా కేసు నమోదైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇంట్లో తనిఖీలు చేయగా కొన్ని ఇంజెక్షన్లు, వైద్య వస్తువులు లభించాయి. మరికొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులన్నిటినీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
తాజాగా నివేదిక వెలుగులోకి వచ్చింది. దాదాపు 6 నెలల తర్వాత బాధితురాలి శరీరంలో శక్తివంతమైన మత్తుమందు ఉన్నట్లు నిర్ధారణ అయింది. కృతికారెడ్డిది సహజమరణం కాదని.. హత్యగా పేర్కొంది. దీంతో బాధిత తండ్రి తీవ్ర ఆవేదన చెందాడు.. తన అల్లుడు మత్తుమందు ఇచ్చి కుమార్తెను చంపాడని ఆరోపించి తిరిగి ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Trump: యుద్ధాలను ఆపడం ఇష్టం.. వచ్చే ఏడాది నోబెల్ రావొచ్చేమో!
మారతహళ్లి పోలీసులు వేగంగా రంగంలోకి దిగి అక్టోబర్ 14న నిందితుడు మహేందర్‌రెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడు తన వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించి సహజ మరణాన్ని చూపించాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు దురుద్దేశంతోనే భార్యను చంపినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. అయితే కృతికారెడ్డి అనారోగ్య సమస్యలను దాచి పెట్టి పెళ్లి చేశారన్న కోపంతోనే మహేందర్‌రెడ్డి ఇలా చేసినట్లుగా సమాచారం.