కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ నిష్క్రమణ కాంగ్రెస్ పార్టీ, దాని న్యాయ బృందం (లీగల్ టీమ్)కు పెద్ద దెబ్బ. విజయవంతమైన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అనేక న్యాయ పోరాటాలలో గత ముప్పయ్ ఏళ్లుగా ఆయన పార్టీకి బలమైన గొంతుకగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుప్రీంకోర్టులో చురుకైన పాత్ర పోషించారు.
పౌరసత్వ(సవరణ) చట్టం, గోప్యత హక్కు, మరాఠా కోటా, జహంగీర్‌పురి కూల్చివేత వంటి అనేక కేసులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వకాల్తా పుచ్చుకున్నారు. నిజానికి వీటితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కానీ అవన్నీ బీజేపీ ప్రభుత్వ విధానాలు, దాని రాజకీయాలను సవాలు చేసినవే. వ్యాపమ్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, ద్వేషపూరిత ప్రసంగాల కేసులు, నోట్ల రద్దు కేసులను సిబల్ పర్యవేక్షించారు.
మైనింగ్ లీజుల మంజూరు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA) కుంభకోణం ఆరోపణలు, షెల్ కంపెనీలకు డబ్బు బదిలీలకు సంబంధించిన కేసులలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను రక్షించేందుకు కపిల్ సిబల్ చట్టపరంగా ప్రయత్నిస్తున్నారు. హేమంత్ సోరెన్ పార్టీ ‘జార్ఖండ్ ముక్తి మోర్చా’..కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పక్షం.
కర్ణాటక, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలో ఉన్నప్పుడు సిబల్ అండగా నిలిచారు. బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు నోటీసుకు వ్యతిరేకంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తరపున సుప్రీంకోర్టులో వాదించారు. అదేవిధంగా ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు ప్రధాన న్యాయవాదిగా పనిచేశారు. చిదంబరం అరెస్టయిన తర్వాత ఆయన కోసం సిబల్ న్యాయపోరాటం చేశారు. అంతేకాదు.. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కోసం కూడా సిబల్ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
ములాయం సింగ్ యాదవ్ కుటుంబంతో కూడా సిబాల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత పోరులో అఖిలేష్ యాదవ్‌కు అండగా నిలిచి ‘సైకిల్’ గుర్తు ఆయనకే చెందేలా ఎన్నికల కమిషన్ తో వాదించి గెలిచాడు. గత వారం ఆ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వాదించారు. తప్పుడు కేసులు పెట్టి ఆయనను జైలులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టుకు చూపించి బెయిల్ ఇప్పించారు. చీటింగ్ కేసు, భూ కబ్జాలు సహా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజంఖాన్ 27 నెలలుగా జైలులో ఉన్నారు.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కూడా కపిల్ సిబల్ వాదించారు. ప్రస్తుతం ఆయన సహారా గ్రూప్‌కు సంబంధించిన వివిధ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయవాద వృత్తిలో కపిల్ సిబల్ ఉన్నత పదువలు అధిరోహించారు. 1990లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1995 – 2002 మధ్య, మూడు సార్లు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంతటి సమర్థుడైన న్యాయవాది పార్టీకి దూరం కావటం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమే. అభిషేక్ సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్ వంటి వారు ఉన్నా సిబల్ నిష్క్రమణతో ఏర్పడిన లోటు అలాగే ఉంటుంది.
కపిల్ సిబల్ గొప్ప న్యాయవాది మాత్రమే కాదు విలక్షణ పార్లమెంటేరియన్.. లౌకికవాద నాయకుడు. కాంగ్రెస్ రెబల్ గ్రూప్ జీ-23లో ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్టీ ప్రక్షాళన దిశగా అధినాయకత్వం చొరవ చూపడం లేదని బహుశా ఆయన ఆగ్రహించి ఉండవచ్చ. పార్టీ నాయకత్వం తీరుతో విసిగిపోయి సిబల్ ఈ నిర్ణయం తీసుకున్నారనిపిస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్‌తో ఉన్న ముప్ఫై ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు వెళుతున్నారు.
DK Shiva Kumar : కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌పై ఈడీ చార్టిషీట్
నిజానికి కపిల్ సిబల్ పార్టీని వీడటం పట్ల కాంగ్రెస్ నాయకత్వానికి బాధ ఉండకపోవచ్చు. పైగా సంతోషించి ఉండవచ్చు. గాంధీల నాయకత్వాన్ని ప్రశ్నించిన క్షణం నుంచే ఆయన వారికి టార్గెట్ అయ్యారు. సిబాల్ మాత్రమే కాదు.. వారి నాయకత్వాన్ని ప్రశ్నించి పార్టీలో ఎవరూ మనుగడ సాగించలేరు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా రేపయినా కపిల్ సిబల్ కాంగ్రెస్‌ను వీడాల్సిన వాడే. ఆయన కూడా ఇదే మాట అంటున్నారు.
ఎక్కువ కాలం ఒకే పార్టీకి కట్టుబడి, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం చాలా చాలా కష్టం అంటారు సిబల్. ప్రతీఒక్కరూ వారి గురించి వారు ఆలోచించుకుని..వాటిని అమలు చేయాలన్నారు. అయితే అందుకు కొత్తగా ఆలోచించాలని, అందుకే బయటకు రావాల్సి వచ్చిందంటూ కపిల్ సిబల్ తన రాజీనామాపై వివరణ ఇచ్చారు. నిజానికి ఆయన పార్టీని వీడడం ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చానని.. కానీ వాటిని ఎవరూ అర్థం చేసుకోకపోవటం తనను ఆశ్చర్యపర్చిందని సిబల్ చమత్కరించారు. ఎంతైనా ఆయన గొప్ప లాయర్ కదా ఆ మాత్రం ఉంటుంది.