Nehru Museum Renamed: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా మార్చాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీగా పేరు మార్చాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీ ప్రత్యేక సమావేశం తర్వాత దాని పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా మార్చాలని నిర్ణయించారు. సొసైటీ ఉపాధ్యక్షుడు కూడా అయిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారు.
Read Also: Viral News: విమానంలోకి పెద్ద పక్షి.. ఫైలట్ ముఖం నిండా రక్తం.. అయినా సరే..!
అయితే ఇప్పుడు ఈ నిర్ణయమే ఇరు పార్టీల మధ్య సరికొత్త వివాదాన్ని రేకెత్తించింది. దేశ రాజధాని ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ లోని మ్యూజియం పేరును మార్చడం జరిగింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత జైరాం రమేష్.. దేశ తొలి ప్రధానిగా చేసిన జవహర్ లాల్ నెహ్రూ విలువను తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆయన పార్టీ ఇలాంటి పని చేసిందని అన్నారు. ‘‘చరిత్ర లేని వారు, ఇతరుల చరిత్రను చెరిపేసేందుకు వెళ్లారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ పేరును మార్చడానికి దురదృష్టకర ప్రయత్నం ఆధునిక భారతదేశం యొక్క రూపశిల్పి మరియు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయదు. ఆయన ప్రజాస్వామ్య సంరక్షకుడు’’ అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ నీచ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీపై అంతే స్థాయిలో విరుచుకుపడింది. ఈ అంశాన్ని రాజకీయం చేయడం ఆపేయాలని సూచించింది. రాజవంశాని కన్నా గొప్ప నాయకులు భారతదేశానికి సేవ చేశారని.. దాన్ని కాంగ్రెస్ అంగీకరించడం లేదని, పేరు మార్పు అనేది రాజకీయాలకు అతీతంగా జరిగిన ప్రయత్నం.. దీనిని గ్రహించే దృక్పథం కాంగ్రెస్ కు లేదని నడ్డా ట్వీట్ చేశారు. ప్రధానులుగా పనిచేసిన సొంత నేతలను కూడా కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుదాన్షు త్రివేది అన్నారు.