Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన బీజేపీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ముంబైలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ కూడా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన, ఎన్సీపీలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: AskNidhhi : ఆ రెండు సినిమాలతో మరింత దగ్గరవుతా : నిధి అగర్వాల్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు ఘన విజయం సాధించాయి. ఏకంగా 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 233 సీట్లను గెలుచుకున్నాయి. 132 సీట్లను దక్కించుకున్న బీజేపీ, సింగిల్ లార్జె్స్ట్ పార్టీగా నిలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెరపడింది. ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు..? అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగింది. బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ని ఖారు చేసింది. దీంతో రేపు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, సీఎం పోస్టుపై ఏక్‌నాథ్ షిండే కూడా ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఈసారి డిప్యూటీ సీఎంకే పరిమితం కావాల్సి ఉంది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో రేపటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ప్రధాని మోడీతో పాటు బీజేపీ పెద్దలు , ఎన్డీయే నేతలు అంతా హాజరుకాబోతున్నారు.