Jagadish Shettar: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటకలో ప్రముఖ లింగాయత్ నాయకుడు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2012 నుండి 2013 వరకు రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన బీజేపీ పై విమర్శలు చేశారు. ఈ రోజు బీజేపా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, మాజీ సీఎం, ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై పలువరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో బీజేపీని బలంగా మార్చిన నేతల్లో నేను ఒకరి అని, బీజేపీ నాకు గౌరవం ఇచ్చింది, స్థానం ఇచ్చింది, అందుకు బదులుగా నేను బీజేపీ బలోపేతానికి కృషి చేశానని జగదీష్ షెట్టర్ అన్నారు. ప్రతీసారి 20 వేల నుంచి 25 వేల ఓట్ల తేడాతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో తిరుగుతున్నాను, ఈ సారి కూడా సహజంగా నాకే టికెట్ వస్తుందని భావించాలని , కానీ బీజేపీ నాలాంటి సీనియర్ వ్యక్తికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిందని అన్నారు.
Read Also: Burkina Faso: బుర్కినా ఫాసోలో నరమేధం..40 మందిని చంపిన ఉగ్రవాదులు..
నాలాంటి సీనియర్ నాయకుడిని పార్టీ సరిగా చూసుకోకపోవడం బాధ కలిగించిందని, ఏప్రిల్ 11న నాకు టికెట్ ఇవ్వమని బీజేపీ వారం రోజుల ముందే చెబితే తాను తన బాధ్యతలను నిర్వహించమని అడిగితే అంగకరించే వాడినని ఆయన అన్నారు. నేను బీజేపీ అనే ఇంటిని నిర్మించేందుకు సహాయం చేశానని, ఆ ఇంటి నుంచి బలవంతంగా నన్ను బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, పార్టీయే ప్రధానం అని బీజేపీని నిర్మించామని, కానీ ప్రస్తుతం కొంత మంది వ్యక్తులే పార్టీని నియంత్రిస్తున్నారని, నేను ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి అమిత్ షాను, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను విమర్శించడం లేదు. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాల గురించి వారికి తెలియకపోవచ్చని అన్నారు.
జగదీష్ షెట్టర్ చేరికపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి ఆయనను స్వాగతిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో 150 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని అన్నారు. ఈ సారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని అన్నారు. జగదీష్ షెట్టర్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయినప్పటికీ సెక్యులర్ నాయకుడు అని, తాను సీఎంగా ఉన్న సమయంలో ఇద్దరం కలిసి పనిచేశామని మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అన్నారు.