Delhi Man Arrest: హవాలా మార్గాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను మళ్లిస్తున్న వ్యక్తిని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, అల్-బదర్‌లకు డబ్బును మళ్లించినట్లు ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ హెచ్‌జిఎస్ ధాలివాల్ వెల్లడించారు. హవాలా మార్గాల ద్వారా పంపిన ఈ డబ్బును కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు మహ్మద్ యాసిన్ ఢిల్లీలోని తుర్క్‌మన్ గేట్ ప్రాంతంలో ఉంటూ వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. అతను గత వారం కశ్మీర్‌లోని అబ్దుల్ హమీద్ మీర్ అనే ఉగ్రవాద కార్యకర్తకు సుమారు 10 లక్షల రూపాయలను పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసి మీర్‌ను అరెస్టు చేశారు. యాసిన్‌ను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. అతని నుంచి రూ.7 లక్షల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షబీభత్సం.. కూలిపోయిన చక్కి వంతెన
యాసిన్ హవాలా మనీ ఛానెల్‌గా పని చేశాడు. విదేశాల్లో ఉన్న తన పరిచయాల నుంచి నిధులు పొంది, ఆ నిధులను జమ్మూ కశ్మీర్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు చేరవేసేవాడు. విచారణలో దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌లోని సూరత్, ముంబైలకు హవాలా నగదు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హవాలా సిండికేట్‌లో యాసిన్ కీలక లింక్ అని పోలీసులు తెలిపారు.