PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై భారతదేశం “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేసింది. చర్యలు, దౌత్యమార్గాల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది.
Read Also: Batenge to Katenge: ‘మహా’మంత్రంగా సీఎం యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం..
ఇరాన్ అధ్యక్షుడు భారత జోక్యాన్ని కోరారు. మధ్యప్రాచ్యంలో సంక్షోభం తీవ్రతరం కాకుండా న్యూఢిల్లీ కీలక పాత్ర పోషించగలదని నొక్కి చెప్పారు. మిడిల్ ఈస్ట్‌లోని అన్ని దేశాలతో భారత్‌కి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూకి ఫోన్ చేశారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మోడీని కలిశారు. ఇరాన్ అధ్యక్షుడిని భారత్‌లో సందర్శించాలని ప్రధాని మోడీ ఆహ్వానించినట్లు మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదే విధంగా ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టు గురించి కూడా ఇరువురు నేతలు సంభాషించారు. భారత్-ఇరాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మాట్లాడారు. ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ లేదా INSTC వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత పీఎం మోడీ ఎక్స్‌లో .. “ఇరాన్ అధ్యక్షుడు మిస్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో చాలా మంచి సమావేశం జరిగింది. మేము మా దేశాల మధ్య పూర్తి స్థాయి సంబంధాలను సమీక్షించాము. భవిష్యత్ రంగాలలో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి మార్గాలపై కూడా చర్చించాము..” అని ట్వీట్ చేశారు.